ప్రతిరోజు పీఠంలో తెల్లవారుజామున 4 గం||లకు దీపారాధన మరియు శ్రీ సూక్తముతో కుంకుమపూజ, ప్రసాద నైవేద్యము, సోమ, శుక్ర, శని వారములలో స్వామివారికి పురుషసూక్తముతో పూజలు మరియు పంచామృతాలతో అభిషేకములు, రుద్రహొమములు జరుపుతారు. శ్రీ సూక్తముతో అమ్మవారికి వివిధ పండ్ల రసములతోనూ, ఆవుపాలతోనూ, అభిషేకములు జరుపుతారు. |
శుక్రవారము నాడు ప్రత్యేకముగా ఉదయం 4 గంటలకే నిత్యపూజానంతరము “కమల సత్యనారాయణ” వ్రతము జరిపి తీర్ధప్రసాద వితరణ చేస్తారు. సాయంత్రము ‘వైభవ కమల’ వ్రతమును జరిపి గురుచరిత్ర పారాయణము చేస్తారు. ఇందులో విశేషసంఖ్యలో భక్తులు కూడా పాల్గొని వ్రతమును ఆచరిస్తారు. ప్రతి మంగళ, శుక్రవారాలలో పీఠంలో సాయంత్రం 6 గం||ల నుండి 8 గం||ల వరకు లలితా సహస్రనామ మరియు విష్ణుసహస్ర నామ పారాయణ మరియు దేవీ ఖడ్గమాల నామావళి పారాయణ జరుగుతాయి. |
ప్రతి నిత్యము పీఠములో సాయంత్రం 7 గం||ల నుండి 8-30 ని||ల వరకు భక్తులచే యోగుల చరిత్రల అనుభవాలను, శ్రీ కమలాంబికా దివ్య చరిత్రములోని భక్తుల అనుభవాలను సమన్వయపరచి, ‘సత్సంగము’ నిర్వహిస్తారు. ప్రతి అమావాస్య, పౌర్ణమి, పర్వదినములలో గురువుగారి ఆజ్ఞానుసారము భక్తులు పీఠంలో ‘నిద్రలు’ చేస్తుంటారు. ఇంతేకాక భక్తులు దూరప్రాంతముల నుండి కూడా పీఠమునకు వచ్చి, వారి వారి మ్రొక్కులు అనగా శుభకార్యములకు ముందే పీఠదర్శనం, పూజ కావించుకుని, ప్రసాదము తీసుకుని వెళ్తుంటారు. చాలామంది భక్తులు నోములు, వ్రతాలు మరియు పుట్టినరోజులు, పెళ్ళికూతుర్ని చెయ్యడం, అన్నప్రాసనలు, బారసాలలు, గర్భిణీ స్త్రీలకు ‘చలివిడి’ పెట్టే ఆచారములు, పిల్లల అక్షరాభ్యాసములు, ఉపనయనములు జరుపుకొనే ఆచారము పీఠం ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకూ సాగుతూనే వున్నది. పర్వదినములలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అనగా జనవరి 13వ తారీఖున జరిగే శ్రీ కమలాంబికా జన్మదిన వేడుకలలో అమ్మవారికి మరియు గురువుగారి చిత్రపఠమునకు ‘భోగి’ పండ్లు పోసి పూజలు జరిపి ప్రసాద వితరణ చేస్తారు. ఆశీర్వచనములు పొందుతారు. |
సంక్రాంతి పండగనాడు అమ్మవారికి ప్రత్యేకముగా నైవేద్యము పెడతారు. ‘ముక్కనుమ’ నాడు శ్రీ కమలాంబికా సోదరులైన ‘శాంతానందస్వాముల’ వారి ఆరాధనోత్సవము సందర్భముగా వికలాంగ బాలబాలురకు, వృద్ధులకు అన్నదానము మరియు వస్త్రదానము చేస్తారు.
మాఘమాసములో వచ్చే ‘వసంత పంచమి’ నాడు పీఠములో పిల్లలకు ఉచితముగా సామూహిక ఉపనయనములు జరుపుతారు. మహాశివరాత్రి నాడు స్వామివారికి రోజంతా అర్చనలు, అభిషేకములు, హొమములు జరుపుతారు. రాత్రంతా భక్తులు ‘జాగరణ’ చేసి, సత్సంగములు మరియు శివనామ జపములు జరుపుతారు.
13న గురువులైన శ్రీమతి రత్నబాలగారి జన్మదిన వేడుకల సందర్భముగా ఆర్ధికముగా వెనుకబడియుండి, ప్రతిభావంతులైన విద్యార్ధులకు ఉచితముగా పరిక్ష ఫీజులు ఏర్పాటు చేస్తారు. అంతేకాక పిల్లలకు నోట్ పుస్తకములు, పెన్నులు పంచుతారు. పంచాంగశ్రవణం కూడా వుంటుంది.
‘హనుమత్ జయంతి’ సందర్భముగా హనుమాన్ చాలీసా పారాయణ 108 సార్లు భక్తులచే జరుపబడుతుంది. ఆ రోజున ‘సువర్చలాంజనేయస్వామి వారల కళ్యాణము’ అత్యంత వైభవోపేతంగా జరుపుతారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటారు. ఈ సందర్భముగా పేదలకు అన్నదానము జరుపుతారు.
గురుపౌర్ణమి సందర్భముగా కమలాంబికా(గురునామము) నామముతో ప్రత్యేక హొమం నిర్వహిస్తారు. భక్తులు కూడా చాలామంది పాల్గొని ‘కమలాంబికా పాదుకలకు’ సహస్రనామాచర్చనలు జరుపుతారు. ప్రసాదవినియోగము తర్వాత సాయంత్రము గురువుల అనుగ్రణ భాషణము, కమలాంబికా దివ్యచరిత్రమునకు సంబంధించిన ఉపన్యాసములు ఉంటాయి.
‘వినాయక చవితి’, ‘కృష్ణాష్టమి’ పండుగలను విశేషంగా జరుపుతారు. చదువుకునే పిల్లలు వచ్చి పీఠంలో వినాయక చవితి పూజలను జరుపుకుంటారు. అలాగే సంతానం కోసం స్త్రీలు కృష్ణునికి, వెన్నను నైవేద్యంగా పెట్టి, ఉయ్యాలలో కృష్ణుని పడుకోబెట్టి, ఉయ్యాలను ఊపుతూ, గానం చేస్తుంటారు. ఇవి కూడా పీఠంలో అనాదిగా వస్తున్న ఆచారములు.
నవరాత్రి మహొత్సవములు రంగరంగ వైభవంగా జరుపుతారు. ఉదయం 4 గం||లకు బ్రహ్మముహూర్తములో ‘కలశస్ధాపన’ నిత్యపూజ మొదలుకొని రాత్రి 10 గం||లకు అమ్మవారికి పవళింపు సేవతో కార్యక్రమములు ముగుస్తాయి. 9 రోజులకు సంబంధించిన 9 ప్రత్యేక పూజలు, హొమములు లక్ష కుంకుమార్చనలు, దశసహస్రములు, సహస్ర కుంకుమార్చనలు సాయంత్రము ఆధ్యాత్మిక ప్రసంగములు రాత్రి – పల్లకీ ఊరేగింపు తర్వాత కీర్తనలు, పవళింపు సేవతో ముగుస్తాయి. సరస్వతీ పూజ రోజున ప్రత్యేకముగా బాలలందరూ పళ్ళరసంతో సరస్వతీ పూజను గావిస్తారు. విజయదశమి నాడు అక్షరాభ్యాసములు, సామూహిక అన్నసమారాధనతో దసరా వేడుకలు ముగుస్తాయి.
గురువులైన శ్రీ మాతా కమలాంబికా ‘ఆరాధనోత్సవము’ను 3 రోజులు ఘనంగా జరుపుతారు. ఈ సందర్భముగా ఆ మూడు రోజులు వృద్ధాశ్రమములో అంధులకు, వికలాంగుల స్కూళ్ళలోను అన్నదానమును నిర్వహిస్తారు. ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రసంగములు మరియు భక్తుల ప్రశ్నలకు – గురువు గారి సమాధానము వంటి కార్యక్రమములు జరుపుతారు