1956 సం||లో శ్రీ కమలమ్మగారి చేత మొట్టమొదటి సారిగా ఏలూరులోని ప్రతాప విశ్వేశ్వరస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్న పెంకుటింట్లో బాలా త్రిపురసుందరి ప్రతిష్ఠ గావించబడినది. 1993లో గురువులైన శ్రీమతి రత్నబాల గారు ఈ భవనమునకు స్లాబు వేయించి ‘కమలాంబిక ముక్తిధామం’ అని పేరు పెట్టినారు. కమలాంబిక గారు 1977 సంవత్సరము వరకు ఈ పెంకుటింట్లో నివసించి, అమ్మవారిని సేవిస్తూ, 1977 సం||లో కపాలమోక్షం పొందినారు. తరువాత గురువులైన శ్రీ త్రిపురసుందరి గారు కూడ 2006 సంవత్సరము వరకు యిక్కడే నివసించి, అమ్మవారిని సేవిస్తూ, భక్తులను ఉద్ధరిస్తూ 2006 సం||లో సిద్ధి పొందినారు.

2007 సం||లో దేవాదాయశాఖ లీజు పూర్తి అవటంతో, శ్రీమతి రత్నబాల గారు ‘శ్రీ శ్రీ రత్నకమలాంబిక సేవాశ్రమము’ అనే పేరుతో ఒక స్వంత భవనమును నిర్మించి, అందు ‘శ్రీ బాలా త్రిపురసుందరీ పీఠము’ను పునః ప్రతిష్ఠించినారు. ఈ భవనము యొక్క భూమి పూజలో శ్రీమతి రత్నబాల గారు, భారత దేశములోని వివిధ తీర్ధములనుండి, అనగా కేదారనాథ్, బదరీ, కాశ్మీర్, హరిద్వార్, కాశీ, నైమిశారణ్యం, మధుర, బృందావనం, కన్యాకుమారి మొదలగు పుణ్యక్షేత్రముల నుండి సేకరించిన పాషాణములు, మృత్తికలు, నదీజలములు, పట్టువస్త్రములు, రుద్రాక్షలు మరియు మానససరోవరము నుండి తెప్పించిన గంగాజలము, చెట్టు బెరడు లాంటి ముఖ్యమైన, విలువైన విశేష వస్తువులను ఆ భూమిలో నిక్షిప్త పరచినారు. ఆ విధముగా ఆ “ఆశ్రమ” పునాదుల్లోనే అటువంటి “ఆధ్యాత్మిక నిధులు” నిక్షిప్తమై ఉన్నాయి. ప్రస్తుతము సేవా కార్యక్రమములన్ని ఈ భవనమునోనే ఎంతో వైభవోపేతంగా జరుపబడుతున్నవి.

పీఠాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 1995 సం||లో పీఠమునకు దగ్గరలో 156 గజాల స్ధలమును కొని, అందులో రెండతస్తుల భవనమును నిర్మించి, పై అంతస్తులో ధ్యానమందిరమును ఏర్పాటు చేసినారు. ఇక్కడ సుమారు 10 సం||ల పాటు నిర్విరామంగా, ఎంతో వైభవోపేతంగా, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ప్రస్తుతము దీనిని ‘మ్యూజియం’గా మార్చడమైనది.

ఈ మ్యూజియంలో శ్రీ కమలమ్మ గారు (సుమారు 1940 – 1977 సం|| వరకు) వాడిన పురాతన వస్తువులు, కమలాంబిక గారు స్వయంగా ఒక భక్తునికి రాసిన లేఖ, తరువాత గురువులైన శ్రీ త్రిపురసుందరి గారి వస్తువులు, శ్రీ త్రిపురసుందరి గారి కేశములు, పన్ను తదితర ముఖ్యమైన వస్తువులను భద్రపరిచి ఉన్నారు. ఈ మ్యూజియం నందు గ్రంధాలయం కూడా ఏర్పాటు చేసివున్నారు.

 

శ్రీ కమలాంబిక: మాతా కమలాంబిక పాలరాతి విగ్రహాన్ని జైపూర్ లో చేయించి, ఫిబ్రవరి 9, 2008న శ్రీమతి రత్నబాల గారు ఈ పీఠంలో ప్రతిష్ఠించినారు

శ్రీ లలితా మహా త్రిపుర సుందరి: 2008-నవంబర్ 29,30 మరియు డిసెంబర్ 1 అనగా మార్గశిర శుద్ధ చవితి నాడు అమ్మమ్మ గారి ఆరాధనోత్సవములు ఏలూరు లోని రత్న కమలాంబిక సేవాశ్రమములో అత్యంత వైభవంగా జరిగినాయు. ఈ సందర్భములో డిసెంబర్ 1న, సుమారు 60 సం||ల క్రిందట శ్రీ కమలమ్మ గారిచే ప్రతిష్ఠించబడిన శ్రీ బాలా త్రిపుర సుందరీ రజత విగ్రహమునకు నిత్య శ్రీ సూక్త అభిషేకములు జరుపుటకు వీలుగా పరిపూర్ణ ఆకృతిని కల్పింపచేసి “శ్రీ లలితా మహా త్రిపుర సుందరి” అని నామకరణము గావించి, పునః ప్రతిష్ఠించడమైనది. బిందు మండల వాసియై శ్రీ చక్ర పీఠమున అధిష్టాన దేవతగా ఉన్నది ఈ లలితా మహా త్రిపుర సుందరి, తన చుట్టూ పరివార దేవతలతో (అనగా గురువులు, పరమ గురువల పరివేష్ఠితమై) అధిష్ఠించి యుండుట ఈ పీఠము నందలి విశేషము మరియు ప్రత్యేకత.

శ్రీ బాలగౌరి: బాలా త్రిపురసుందరీస్వరూప (3 అడుగుల) నల్లరాతి విగ్రహమును కూడా ఇందు ప్రతిష్ఠించడమైనది. శ్రీమతి రత్నబాల గారు విగ్రహం విశిష్టత గురించి ఈ విధంగా చెప్పారు. ఈ విగ్రహమును చేయించుటకు సుమారు ఒక సంవత్సరము ముందుగానే నాకు స్వప్నము లో ఒక 7,8సం||ల పాప గర్భ గుడిలో మధ్యగ ఒక ఎత్తైన ఆసనముపై కూర్చుని, నా చేత సర్వాలంకారములూ చేయించుకుంటున్నది. ఆమెను నేను “నిన్ను ఏ పేరుతో పిలవాలి?” అని అడుగుతూండగా, ఆ పిల్ల, నన్ను “బాలగౌరి” అని పిలవమని ఆదేశమిచ్చింది. ఆ తరువాత “సామవేదం షణ్ముఖ శర్మ” (ఋషి పీఠం) గారు మాస పత్రిక పైన ఒక ముఖ చిత్రం వేశారు. అది చూసి నేను ఆశ్చర్యచకితురాల్ని అయ్యాను. ముఖ చిత్రంలో అదే 7,8సం||ల పాప, చేతులలో పాశాంకుశములు, వరదాభయ ముద్రలతో కూర్చుని వున్నది. ఆ స్వరూపము పేరు “బాలా త్రిపురసుందరి” అని రాశారు. ఆ ఫొటో నమూనాతో హైదరాబాదులో ఆ విగ్రహాన్ని చేయించి సేవాశ్రమములో ప్రతిష్టించడమైనది. ‘గౌరి’ అనగా ‘గురువు’ ‘బాల గౌరి’ అనగా సాక్షాత్తూ బాల యే ‘గురువు’ గా అవతరించడము. గురువులైన శ్రీ కమలాంబిక కూడా బాలా త్రిపురసుందరీ అవతారమని ఇక్కడ మనకు విశదమవుతున్నది.

శ్రీ మోక్షలక్ష్మి: భద్రాచలంలో కొన్ని శతాబ్దాలక్రితం నుండి జమీందారుల చేత పూజింపబడుతున్న లక్ష్మి విగ్రహాన్ని గుడికి ఇచ్చినారు. ఈ విగ్రహాన్ని చూచిన శ్రీమతి రత్నబాల గారు ఆనందభరితులై, అదే నమూనాతో, స్వచ్ఛమైన రాగితో విగ్రహాన్ని చేయించి, ‘మోక్షలక్ష్మి’ అని నామకరణం చేసి, ఏలూరులోని ఈ పీఠంలో మొట్ట మొదటగా 09.02.2008న ప్రతిష్ఠించినారు. ఈ మోక్షలక్ష్మి ధ్యానముద్రలో ఉండుట విశేషం. ధ్యానముద్రలో ఉన్న లక్ష్మి చాలా అరుదుగా కనిపిస్తుంది.

శ్రీ స్వప్రకాశేశ్వర స్వామి: శ్రీమతి రత్నబాల గారు విగ్రహం విశిష్టత గురించి ఈ విధంగా చెప్పారు. ‘భగవాన్ పూర్’ అనే గ్రామం (ఋషీకేష్ నుండి బదరీ-కేదార్ నాద్ వెళ్ళే దారిలో) ‘మందాకిని’ ‘అలకానంద’ సంగమం దగ్గర్లో ఉన్నది. నా భర్త ఎస్.బి.ఐ. బ్రాంచ్ ఆడిట్ చేస్తూ, భగవాన్ పూర్ బ్రాంచ్ మేనేజర్ S.గుప్తా గారిని కలిసారు. ఆయన్ని, మావారు “సాలగ్రామాలు ఇక్కడ దొరుకుతాయిట కదా! నాకు ఒకటి కావాలి!” అనడిగారు. గుప్తాగారు స్వయంగా ఆ నదిలో దిగి, 2 సాలగ్రామాలు వెదికి, 2006, డిసెంబర్ 31న ఋషికేష్ లో అందచేశారు. ఒకటి అర్ధ నారీశ్వరలింగం. లింగం సగం తెల్లగాను, సగం నల్లగాను ఉండడం విశేషం. వేద పండితులు చూసి ఆ రెండు సాలగ్రామాలు కూడా జీవచైతన్యంతో ఉన్నాయనీ, వాటిని ముట్టుకొంటే జీవనాడి కొట్టుకోవడం, స్వయంగా అనుభూతి చెందినారని చెప్పి, రెండిటిని ప్రతిష్టించమని సెలవిచ్చారు. అందులో ఒకటైన అర్ధనారీశ్వర లింగాన్ని ముందుగా 09.02.2008న సేవాశ్రమంలో ప్రతిష్ఠించడమైనది. శ్రీమతి రత్నబాల గారు డెహరాడూన్ లో వుండగా ‘మస్సోరి’ వెళ్ళే దారిలో ఉన్న ‘ప్రాచీన శివ మందిర్’కి తరచు వెళ్ళేవారు. ఆ స్వామి పేరు ‘స్వప్రకాశేశ్వరుడు’. అది కూడా అర్ధనారీశ్వర లింగము. అది దర్శించిన శ్రీమతి రత్నబాల గారికెంతో ఆనందం కలిగి, ఎప్పటికైనా పీఠంలో శివునికి అదే పేరు పెట్టాలని నిర్ణయించుకుని, ఆ పేరు పెట్టడం జరిగినది. ఆ విధంగా పరమశివుడు హిమాలయాలనుండి స్వయంగా “హేలాపురి” లో వున్న పీఠానికి తరలి వచ్చి, ఆయన వెలుగుల్ని మనందరిపై ప్రసరింప చేయుచున్నారు.

శ్రీ యోగ నరసింహస్వామి: శ్రీమతి రత్నబాల గారు విగ్రహం విశిష్టత గురించి ఈ విధంగా చెప్పారు.నేను 2008-ఆగస్టు 4న హైదరాబాదులో వున్న “శివతేజ బాబా” గార్ని కలవడం జరిగినది. వారు సద్గురువులు. వారితో మాట్లాడుతుండగా వారు మధ్యలో “మరి ఆ రెండో శివలింగాన్ని ప్రతిష్ఠించలేదేం?” అని అడిగారు. అప్పుడు నాకు, ప్రతిష్ఠ చెయ్యని ఆ రెండో లింగం సంగతి స్ఫురణకు వచ్చింది. “మీ అమ్మమ్మ గారి తండ్రి అయిన కొక్కొండ వెంకటరత్నం గారి ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సాలగ్రామం అది. నీవు దాన్ని వెంటనే ఈ శ్రావణమాసం లోనే ప్రతిష్ఠించు.” అని చెప్పారు. ఆ విధంగా నరసింహస్వామి వారు కూడా పీఠానికి రాదలచినారు. ఆ తరువాత 2008-ఆగస్టు 22వ తారీఖున శ్రీ రత్న కమలాంబిక సేవాశ్రమంలో “యోగ నరసింహస్వామి” వార్ని ప్రతిష్ఠించడం జరిగినది. ఆ లింగము ఫాల భాగంపై ఒక ‘నామం’ కలిగి ఉండడము ప్రత్యేకత. వీరిని దర్శించిన వారికి ‘యోగాన్ని’ అనుగ్రహించాలని గురువుల సంకల్పము.
 
 

శ్రీ మోక్ష గణపతి: ఈయన్ని హైదరాబాదు లోని “హరి హర క్షేత్రం” నుండి తీసుకువచ్చి, ఏలూరు పీఠం లో ప్రతిష్ట చేసి, ‘మోక్ష గణపతి’ అని నామకరణం చెయ్యబడినది. పీఠాన్ని దర్శించి, సేవించుకున్న వారికి, అత్యుత్తమ స్ధితి అయిన ‘మోక్షము’ కూడా అతి సులువుగా అనుగ్రహించడం, గురుమాత అయిన శ్రీ కమలాంబిక గారు స్వయంగా ఆ స్ధితిని పొంది, భక్త జనుల కెల్ల ఆ స్ధితిని అనుగ్రహించాలనే అపారమైన ఆమె కరుణా కటాక్షాలు ఈ గణపతిని సేవించడం ద్వారా భక్తులకు లభిస్తాయనడంలో సందేహం లేదు.

శ్రీ శ్యామ బాలాజీ : శ్రీమతి రత్నబాల గారు విగ్రహం విశిష్టత గురించి ఈ విధంగా చెప్పారు. హైదరాబాదులో మేము నివసిస్తున్న అపార్ట్ మెంట్ లో 7 సం||ల నుండి ధాన్యంలో పెట్టి వున్నారు “శ్రీ కళ్యాణ వెంకటేశ్వర్లు” విగ్రహం. ఆయనకు ఒక గుడి కట్టించి కూడా కొన్ని కారణాల వలన ప్రతిష్ఠ జరగలేదు. ఆ విగ్రహాన్ని చేయించిన వ్యక్తి నాకు ముందు గానే తెలుసు. ఆయన ఒకరోజు నాకు ఫోన్ చేసి, ఈ బాలాజి విగ్రహాన్ని ఏలూరు ఆశ్రమంలో ప్రతిష్ఠించమని కోరగా, ఆ విగ్రహాన్ని కూడా 2008-ఆగస్ట్ 22న ప్రతిష్ఠించడమైనది. “బాలాజీ” “శ్యామలరావు” అనే యోగి పుంగవులు, మాతా కమలాంబిక గురుదేవులు. అనగా మనందరికీ పరమ గురువులు కనుక ఆ బాలాజీ కి “శ్యామ బాలాజీ” గా నామకరణం చేయడమైనది. ఆ విధంగా ముందు గురువు, తరువాత పరమ గురువులు ఇక్కడ ఆశీనులైనారు.