గురు పరంపర

గురువులతోపాటు శిష్యులు కూడ తరతరాలుగా పరంపరగా కొనసాగుతున్నారు. రాజరాజేశ్వరీ దేవి ఛత్రఛాయలోకి ఎంతమంది అదృష్టవంతులు చేరినా, ఇంకా ఎంతోమందికి చోటు ఉంటుంది. ఎవరీ కమలాంబిక, ఏమిటీ పీఠం అనే జిజ్ఞాసులైన భక్తులకు అందుబాటులో ఉండే విధంగా, అందరిపై ఉన్న ప్రేమతో ఇలా ఇంటర్ నెట్ లో ప్రచురిస్తున్నందుకు భక్తలోకం కృతజ్ఞమై ఉంటుంది.

ఆంధ్రదేశం అన్ని రంగాలలోలాగానే ఆధ్యాత్మిక రంగంలో కూడ అనర్ఘరత్నాలని, అమూల్యమణులని అందించింది. కొన్ని మణులు కనులు మిరుమిట్లు గొలిపే తమ కాంతితో వెలుగుతాయి. తమ ప్రయోజనం పూర్తి అయి స్వస్ఠానాలకి వెళ్ళిపోతాయి. మరి కొన్ని, వంశపారంపర్యంగా అటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలుగా వెలుగొందుతాయి. అలా ఆధ్యాత్మిక సద్గురుపరంపరతో, తరాల తరబడి సాగుతున్న వంశం బ్రహ్మాశ్రీ కొక్కొండ వెంకటరత్నం పంతులుగారిది. వారి సాధనలోని తీవ్రత, జన్యువులలోని సాంద్రత ఎటువంటివోగానీ, ఇప్పటికి మూడు తరాలు అనుసూతంగా సాగింది. మరెన్నో తరాలు ఆధ్యాత్మిక వారసత్వసంపదను అందిపుచ్చుకుని, జన సామాన్యానికి వారి అవసరాలమేరకు ఈ సంపదను వితరణ చేస్తాయి. అది వారి సంకల్పబలం. సంకల్పశుద్ధి, సిద్ధి.

పంతులుగారు భాషా పాండిత్య విషయాలలోనే కాదు, ఆధ్యాత్మిక సాధనలొ కూడ ప్రావీణ్యులు. వారి “తనుమధ్యాంబాదేవి” ఉపాసన ఫలించి వారి సంతానంలోనే ఇద్దరు మహానుభావులై ఆధ్యాత్మిక పీఠాధిరోహణం చేశారు. వారి పెద్ద కుమారుడు ‘శాంతానందస్వామి’గా మాదరబాకం శాంతి ఆశ్రమ పీఠాధిపతులైనారు. వారి రెండవ కుమార్తె, శ్రీమతి బెహరాకమలమ్మ గారు బాలాత్రిపురసుందరీ పీఠం స్థాపించారు.

ఈ బాలాత్రిపురసుందరీ పీఠానికొక విశిష్టత ఉంది. అప్పటి వరకు స్త్రీలు పీఠాలను స్థాపించటం, పీఠాధిపతులు కావటం ఉన్నట్లుగా కనపడదు. ఎప్పుడో వేదాకాలంలో బ్రహ్మనాదివాలైన స్త్రీలుండేవారు. మధ్యయుగాల్లో అంతగా కనపడరు. అటువంటిది పరమఛాందసులుగా పరిగణించబడే కొక్కొండ వెంకటరత్నం పంతులు గారే “నా తర్వాత ఈ పూజాపీఠానికి వారసురాలు ఈమెయే” అని ప్రకటించారు. వారే శుభముహూర్తాన తన కుమార్తెను ఆధ్యాత్మిక వారసురాలుగా చేశారో ఏమో! ఆ పీఠం వారసులు కుమార్తెలే అవుతున్నారు. కమలాంబికగారి తర్వాత, వారి రెండవ కుమార్తె శ్రీ బాలా త్రిపురసుందరి గారు పీఠ నిర్వహణాబాధ్యతని చేపట్టి సమర్ధవంతంగా నిర్వహించారు. వారుండగానే తమ సోదరి కుమార్తె శ్రీమతి సుంకేశుల రత్నబాల గారిని తరువాత వారసురాలిగా శిక్షణనిచ్చారు. ఇప్పుడా బాలా త్రిపుర సుందరీ పీఠం రత్న కమలాంబికా సేవాశ్రమంగా విస్తరిస్తోంది.

19వ శతాబ్ధం మధ్యభాగం నుండి దివ్యపురుషులు, సిద్ధజీవులు, ఋషులు, భూమిపై అవతరించే సందర్భంలో స్త్రీ శరీరాలనే ఎంచుకోవటం కనపడుతూ ఉంది. ఆధ్యాత్మిక సాధనకి, కొన్ని ప్రయోగాలకి స్త్రీ శరీరాలు ఎక్కువ అనుకూలంగా ఉంటాయని వారు చేసిన పరిశోధనలు తెలిపాయి. అందుకే మధ్యతరగతి వారిని, అందులోనూ మహిళలను, ఆధ్యాత్మికంగా చైతన్యవంతులని చేయటానికి స్థాపించబడిన పీఠాధిపతిగా జన్మించేవారు స్త్రీ శరీరాన్ని ఎన్నుకోవటం సహజం, సముచితం.

1. సాక్షాత్ తనమథ్యాంబాదేవి అవతారంగా, పరాశక్తిగా, లలితాపరమేశ్వరిగా భక్తులందరిచేత ఆరాధించబడే దేవి ‘కమలమ్మ’గారు. 2. త్రిపురం పిన్నిగా అందరిచేత పిలవబడే బాలా త్రిపురసుందరిగారు, కోరలతో జన్మించిన మహాకాళీ అవతారం. పుట్టటానికి ముందే కమలమ్మగారి కలలో ఆ విధంగా దర్శనమిచ్చింది. 3. వీరిద్దరు చాలరన్నట్టు ఛత్రంతో సహా (ఇది అధికారానికి చిహ్నం) రాజరాజేశ్వరీ దేవి అవతరించటం. (రత్నబాల గారు పుట్టటానికి ముందు కమలాంబిక గారికి ఛత్రచామరాది సమస్త వైభవాలతో విలసిల్లే రాజరాజేశ్వరి దేవి కనిపించింది కలలో) అందుకే రత్నబాల గారి సారధ్యంలో పీఠానికి రాజదర్పం, చక్రవర్తిత్వం లభిస్తాయి అని చెప్పారు. ఆ ఛాయలు ఇప్పటికే చాలావరకు కనపడుతున్నాయి కదా! పీఠం కీర్తి దేశపు ఎల్లలుదాటి ఎన్నో దేశాల్లో వ్యాపించింది. ఇక్కడ పీఠం, కమలాంబికాముక్తిధామమై, ధ్యానమందిరంగా విస్తరించి, “శ్రీ శ్రీ రత్న కమలాంబికా సేవాశ్రమం”గా సర్వతోముఖాభివృద్ధి సాగిస్తోంది.