బాలాత్రిపురసుందరి
జగన్మాత యొక్క బాల రూపం “బాల”. ఈ రూపం అమాయకత్వం, నిష్కల్మషత్వం, ఆనందం, అల్ప సంతోషం అనే లక్షణాల సమ్మేళనంతో ముద్దు గొలిపే పసిరూపం.బాలగా ముద్దులొలికే ఈ అమ్మవారు సాక్షాత్తు “త్రిపురసందరి”. స్ధూల, సూక్ష్మ, కారణ శరీరాలని సుందరంగా తీర్చిదిద్దే తల్లి. సత్వరజస్తమో గుణాల సమతుల్యతను స్ధాపించగలిగేది మరియు భూ, భువ, సువర్లోకాలని పాలించేది త్రిపురసందరి. శివునికి సహకరిస్తూ, స్ధూల, సూక్ష్మ, కారణ శరీరాలనే ‘త్రిపురాలని’ అధిగమించి, శుద్ధ ఆత్మతత్వాన్ని దర్శించేటట్లు చేయటమే త్రిపురాసుర సంహారము. యోగ శాస్త్రంలో, ధ్యాన ధ్యాతృ ధ్యేయములనే మూడు ఒకటవటాన్ని ‘త్రిపుట భేధనం’ అంటారు. అట్టి స్ధితిని, సులభమైన భక్తి మార్గంలో అందించే తల్లి త్రిపురసుందరి.
బాలాత్రిపురసుందరీ పీఠము
శ్రీ బాలా త్రిపురసుందరీ పీఠము, 1957వ సంవత్సరములో హేలాపురి లోని అగ్రహారమునందు గల పాత శివాలయ ప్రాంగణంలో, శివునికి అభిముఖంగా, శ్రీమతి బెహరా కమలమ్మ గారిచే స్ధాపించబడినది. ఆమె తండ్రి గారైన మహా మహొపాధ్యాయ శ్రీ కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు(1842-1915), ఈమె 5 సంవత్సరముల వయసులో ధ్యాన ముద్రలో ఉన్నప్పుడు అరికాలులో ఉన్న ‘చక్ర ముద్ర’ను గాంచి, భవిష్యత్తులో ‘కమల’ అను నామధేయంతో పిలవబడి, తమ ఆరాధ్య దేవత అయిన “తనుమధ్యాంబ” పీఠమునకు వారసురాలు కాగలదని పలికారు.తరువాత, ఆమె 11 సంవత్సరముల వయసులో, మద్రాసులోని తిరువత్తియూరు నందు గల ‘బాలాజీ’ ‘శ్యామలరావు’ అను ఇరువురు యోగిపుంగవులనుండి ‘బాలా త్రిపురసుందరి’ ఉపదేశం పొందారు. కొంత కాలానికి ఆవిడకు కలలో ‘బాలా త్రిపురసుందరి’ దర్శనమిచ్చి, “నాకు నీ చేతితో తులసి తీర్ధం చాలు. నీ మనో నైర్మల్యము నాకు నచ్చింది. కావున 3 సం||లో నేను నీలో ఐక్యమౌతాను. నీకు భవిష్యద్దర్శనం, వాక్సిద్ధిని సిద్ధింపజేస్తున్నాను. ఇకపై నువ్వు నేనుగా కొలవబడతావు” అని పలికింది.ఆ విధంగా మాతా కమలాంబిక గారు దాదాపు 62 సంవత్సరాల పాటు ఆ దేవిని ఉపాశించి, కపాలమోక్షము ద్వారా సిద్ధిపొందారు. తనను ఆశ్రయించిన భక్తులకు సుఖ సంతోషాలు కలగజేస్తూ, కోరిన భక్తుల ముక్తికి మార్గదర్శకులయ్యారు. ఆమె భక్తుల పాలిట కల్పతరువు.