శ్రీమతి రత్నబాల గారు

(13-3-1957)

Shrimathi Ratnabala Garu ప్రస్తుతము 'బాలా త్రిపుర సుందరి' పీఠము (ఏలూరు, ప.గో.జిల్లా) యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తున్న శ్రీమతి రత్నబాల గారు గురు పరంపరలో నాలుగవ వారు. వారి ఆధ్వర్యంలో ఈ పీఠానికి ఖండాంతర ఖ్యాతి లభించిందనటంలో అతిశయోక్తి లేదు. జన్మవిశేషం:- శ్రీమతి రత్నబాల గారు 1957వ సం|| మార్చి 13 రాత్రి 1.05 ని.లకు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో జన్మించారు. ఆమె జన్మించే సమయానికి ముందే గురువులైన మాతా కమలాంబిక గారు, తెల్లని వస్త్రాలను ధరించి కిరీటంతో త్రిశూలధారిణియై ఛత్రంతో సహా శ్వేతాశ్వాన్ని అధిరోహించిన రాజరాజేశ్వరి దేవి పీఠంలోకి ప్రవేశించటాన్ని దర్శించటం విశేషం. రత్నబాల గారికి 4-5 సంవత్సరముల వయసున్నప్పుడు ప్రక్కన ఉన్న శివాలయంలో శివునికి అభిముఖంగా ఉన్న నందిపై ఎక్కి కూర్చుని ఆడుకుంటూ "అమ్మమ్మా! ఈ ఎద్దు (నంది) నన్ను 'చాముండి, చాముండి' అని పిలుస్తోంది చూడు" అని చెప్పగా విన్న గురువులు 'మాతా కమలాంబిక గారు' ప్రక్కనున్న శిష్యులతో "నా మనవరాలిది రాజ రాజేశ్వరి అంశ. రెండవ తరం వరకు ఈ పీఠం యొక్క ఉనికి గుప్తంగా ఉంటుంది. మూడవ తరంలో నా మనవరాలైన రత్న బాల నిర్వహణలో ఈ పీఠం ఖండాంతర వ్యాప్తి చెందుతుంది." అని పీఠం యొక్క భవిష్యత్తుని తెలియచేశారు.

మాతా కమలాంబిక గారు రత్నబాల గారిని తన వద్దనే ఉంచుకుని కాలేజీ వరకు అభ్యసింపజేశారు. ఆమే రత్నబాల గారి వివాహం సుంకేశుల సాంబశివరావు (ఎస్.బి.ఐ రిటెర్డ్ ఎ.జి.ఎమ్) గారితో జరిపించారు. లీలా మానుషుడైన భగవంతుడు, కార్యకారణ నిర్ముకయైన ఆ భగవతి తమ అంశతో జన్మించిన కారణజన్ములను కర్తవ్యాన్ముఖులను చేయటానికి రకరకాల 'కారణాలు' కల్పిస్తూ ఉంటారు.

ఒక కుమార్తె(పల్లవి), కుమారుని(పవన్)కి జన్మనిచ్చి, సామాన్య స్త్రీ గా సంసార జీవనం సాగిస్తున్న రత్నబాల గారి జీవితంలో కుమారుని అనారోగ్యం (1985) అన్న కారణం కల్పించబడినది. కేవలం మాతా కమలాంబిక గారి అనుగ్రహంతో, కుంకుమ ప్రసాదంతో సంపూర్ణ ఆరోగ్యవంతుడైన ఆ బాలుడు పెద్దవాడై ప్రస్తుతం అమెరికాలో పెద్ద ఉద్యోగంలో స్ధిరపడటం నిజంగా ఒక అద్భుతం.

కుమారుని ఆరోగ్యసందర్భంగా 1985లో సుమారు 29సం|| వయస్సులో గురుపీఠమును, అప్పటి గురువులు 'మాతా త్రిపురాంబ' గారిని ఆశ్రయించి గురూపదేశముతో ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించటం జరిగింది. 'మాతా కమలాంబిక' గారికి అమ్మవారు తనను నీళ్ళలో ముంచుతున్నట్లు, తరువాత పైకి లేపి "3 సం|| తరువాత నేను నీలో ఐక్యమౌతాను, నీ చేతితో తులసి తీర్ధం నాకు చాలు.' అని పలికినట్లు కల వచ్చింది. అదే విధంగా రత్నబాల గారికి కూడా 29సం|| వయస్సులో పతిదేవులైన సాంబశివరావు గారు తన తల పట్టుకుని నీళ్ళలోకి ముంచి లేవదీస్తూ ఏదో చెప్తున్నట్లు, ఈ సంఘటని ఒక స్త్రీ మూర్తి మెట్లమీద నిలబడి చూస్తున్నట్లు కల వచ్చింది.

ఈ సంఘటన తరువాత, గురూపదేశముతో సాధన మొదలై, మనసు మెత్తబడి మనసుకి పట్టిన మలినం కడగబడటం ద్వారా 'మాయా విచ్ఛేదము' జరిగి మానసిక పరివర్తన మొదలైనది. ఆనాటి నుండి రత్నబాల గారు ఎవరైనా ఏ కారణము చేతనైనా బాధపడుతున్నారంటే చూసి చలించిపోయేవారు. ఏ విధంగానైనా వారి బాధను తొలగించాలని తపించిపోయేవారు.

అప్పుడు 'శ్రీ బాలా త్రిపుర సుందరి' పీఠ బాధ్యతలను నిర్వర్తిస్తున్న 'మాతా త్రిపురాంబ' గారి ఆదేశం ప్రకారం 1986-87 నుండి శిష్యుల బాధలను తొలగించడానికి, వారికి గురు పీఠంలో నియమ నిష్ఠలు, ఉపవాస దీక్షలు ఇవ్వటంలోను మరియు పీఠ నిర్వహణ బాధ్యతలలో భాగస్వాములయ్యారు. నియమ నిబంధనలను సడలించి గురువు యొక్క అనుగ్రహాన్ని, వారి బోధనలను అందరికీ అందుబాటులో ఉండేలా చేశారు. బాలా త్రిపుర సుందరి కమలాంబికలో ఐక్యమైంది కావున 'మాతా కమలాంబిక' గారు సాక్షాత్తు బాలా త్రిపుర సుందరి అన్న సత్యాన్ని రత్నబాల గారు వెలుగులోకి తీసుకుని వచ్చారు.

1986 నుండి 2006 లో 'మాతా త్రిపురాంబ' గారు సిద్ధి పొందే వరకు ఎన్నో పీఠాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఎందరో భక్తులకు భక్తి జ్ఞాన మార్గాలను ఉపదేశించారు. మాతా త్రిపురాంబ గారు సిద్ధి పొందిన తరువాత 'బాలా త్రిపుర సుందరి పీఠము' ను 'కమలాంబికా ముక్తిధామము' నుండి 'రత్న కమలాంబిక సేవాశ్రమము' అను స్వంత భవనము నిర్మించి అందులో పునః ప్రతిష్ఠించడమైనది. ఆ నాటి నుండి రత్నబాల గారు పీఠంలో ఎన్నో బృహత్తర కార్యక్రమాలను నిర్వహించటం ప్రారంభించారు. పూజాదికాలే కాకుండా 2001లో 'రత్న కమలాంబిక సేవా ట్రస్టు' ని స్ధాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగిస్తూ భక్తులకు తమ ఆపన్నహస్తమును అందిస్తున్నారు.