శ్రీ కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు

(1842-1915)
ఆచార్య బిరుదురాజు రామరాజు

Shri Kokkonda Venkata Ratnam Panthulu Garu ఆంధ్ర సాహిత్య వైతాళికులలో తొలితరం పండితులు 19 శతాబ్దములో వివిధ సాహిత్య ప్రక్రియల్లో కొత్త పుంతలు త్రొక్కినారు. అట్టి పండిత కవుల్లో కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు ఒకరు. వీరు తెలుగు వారిలో మొదటి మహామహొపాధ్యాయులు, గొప్ప తపస్వి, అక్షరసాంఖ్యాచార్యులు, ఆంధ్ర భాషా సంజీవని పత్రికా సంపాదకులు. వీరు పంచతంత్రము, సింహాచల యాత్ర, బిల్వేశ్వర శతకము, బిల్వేశ్వరీయ ప్రబంధము, కుమార నరసింహము, ధనంజయవిజయవ్యాయోగము, నరకాసుర విజయ వ్యాయోగము, మంగళగిరి మహాత్యము, కోరుకొండ మహాత్యము గోదావరి వర్ణనము, గోవింద మంజరి, దీక్షిత చరిత్రము,యువరాజ పర్యటనము వంటి కృతులనేకం రచించినారు. పండితులు వీరిని ఆంధ్ర జాన్సన్ అనేవారు. చెన్నపట్నం రాజధాని కళాశాలలో పరవస్తు చిన్నయసూరి, కరాలపాటి రంగయ్య, చదలవాడ సీతారామశాస్త్రి గార్ల తరువాత కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు (1878-1899) ఆంధ్ర శాఖాధ్యుక్షులుగా వుండినారు. అటు తరువాత కందుకూరి వీరెశలింగ పంతులు గారికి ఆ పదవి దక్కినది. కొక్కొండ వారు రాజమహేంధ్రవరంలో శ్రే కందుకూరి వారి స్ధానంలో చేరినారు.

కొక్కొండ వారు ఆంధ్ర సాహిత్య సేవ ఎంత చేసినారో ఆధ్యాత్మిక రంగానికి కూడా అంతకంటే ఎక్కువ సేవ చేసినారు. అందువలన ఆ మహాత్ముని కడుపున ఇద్దరు యోగులు జన్మించుట సంభవమయినది. వీరు మద్రాసు లోని మారద బీకం శాంతనంద స్వామి వారు, ఏలూరు లోని బెహరా కమలాంబిక అమ్మవారు. వారు సజీవులుగా వున్నప్పుడు ప్రజానీకమునకు చేసిన సేవ ఎట్టిదో ఈనాడు భౌతికంగా కనుమరుగయిన తర్వాత కూడా అటువంటి లీలలు, అద్భుతాలు ప్రదర్శిస్తూ, దారి తప్పిన వారిని సన్మార్గులను చేస్తున్నారు. జిజ్ఞాసులను, జ్ఞానులుగా తీర్చిదిద్దుతున్న ఇటువంటి ఆధ్యాత్మిక వారసత్వం తరతరాలుగా కాపాడుకొనవలసిన ధర్మం ఉన్నది. ఈ ధర్మం తప్పితే భారతీయ పౌరులు తమ అస్తిత్వం కోల్పోతారు. యోగులు ఆశీస్సులే మనకు శ్రీ రామరక్ష.