శ్రీ శాంతానంద స్వామి

(1880-1950)
శ్రీమతి సుంకేశుల రత్నబాల, యం.ఎ;

Shri Matha Thripura Sundari Garu శ్రీ శాంతానంద స్వామి వారు, కొక్కొండ వెంకటరత్నం పంతులు గారి ప్రధమ సంతానము. పూర్వాశ్రమమునందు వారి పేరు కుమార నరసింహం వీరు గృహస్థాశ్రమంలో ఉండియను జన్మతః జ్ఞాని కనుక తామరాకు పై నీటి బొట్టు వలె, పంకం లోని కుమ్మరి పురుగు వలె, మసలుతూ నిరంతరం జనక మహారాజువలె తత్త్వ విచారణ పరుడై ఉండేవారు. ప్రౌఢ వయస్సులోనే కుమార నరసింహంగారు సంసారం రోసి ఏకాకిగా దివ్యతీర్థాలు తిరుగుతూ భిక్షాన్నం తింటూ అనేక మహాత్ములను దర్శించి ఏకాంత ప్రదేశాల్లో ఉండేవారు. ఆంధ్ర దేశమంతా ఒక్కసారి పర్యటించిన కుమార నరసింహం గారు తూర్పు గోదావరి జిల్లా తోటపల్లి కొండల్లో శాంతాశ్రమం వుందనీ అక్కడ ఓంకార స్వామి అనే మహాతపస్వి ఉన్నాడని తెలిసింది. కుమార నరసింహంగారు తోటపల్లి శాంతాశ్రమం చేరి ఓంకార స్వామిని (1895 - 1982) ఆశ్రయించి సన్యాసం స్వీకరించి శాంతానంద స్వామియైనారు.
శాంతాశ్రమంలో కొంతకాలం తపస్సు చేసి బ్రహ్మనుభవం పొందినారు. ఆయన శిష్యులకు జ్ఞాన బోధలు చేస్తూ మద్రాసు మహానగరం పోలిమేరలో మాదర బాకంలో ఎందరో పూర్వులుండిన ఆశ్రమంలో చేరినారు. వారు భక్తి ప్రేమతో ఎవరేమి సాత్వికాహార మిచ్చినా తింటూ దేశ సంచారం చేసేవారు. వీరు ఒక వేద గోష్టిలో ప్రసంగిస్తూండగా తమ భార్య మరణించిన వార్త వచ్చిందట. అపుడు వీని నేను మాత్రం ఏమి చేయగలను, శవాన్ని ఈ మార్గాన్నే తీసుకు వస్తారు కదా అప్పుడు కలుసుకుంటామని తమ ప్రసంగం కొనసాగించినారట. పూర్వాశ్రమంలోనే అంతటిస్థిత ప్రజ్ఞులగు సన్యాసియైన తరువాత శాంత మహాసముద్రమైన శాంతానందులుగా పరిణమించినారు. క్రీ. శ 1872 విరోధినామ సంవత్సరం పుష్య బహుళ త్రయోదశి సోమవారం 16-1-1950 ఉదయం 9గం||లకు ఉత్తరాయణ పుణ్యకాలంలో శ్రీవారు ధ్యాననిమగ్నులై సునాయాసంగా శరీరం త్యజించినారు. వీరి ఆత్మ పరమాత్మలో లీనమైంది. వీరి శిష్యకోటికి తంతివార్తలు వెళ్ళినవి. వందల సంఖ్యలలో వారి శిష్యులు 16-1-1950 సాయంకాలానికి చేరినారు. భగవద్గీత పారాయణం, భక్తి సంకీర్తనలు, తత్త్వాలు పాడుతూ శ్రీవారి భౌతికకాయానికి అభిషేకాది పుజా విధులు నిర్వర్తించి రాత్రి 12 గంటలప్పుడు సమాధి చేసినారు. అటు తరువాత మండలారాధనం జరిగింది. ఏటేటా వారి శిష్యులు అక్కడ ఆరాధనోత్సవాలు నిరాడంబరంగా జరుపుతున్నారు.