క్రము లేని మనసే చక్రము అట్టి అర్చనే శ్రీ చక్రార్చన

మంచిదయితే మనకి మంచిదవుతుంది అన్నట్లుగా మనసు మానవుడిని జంతువునుండి వేరు చేసి ఆలోచించగలగటం, మాట్లాడగలగటం, ఈ రెండు మనసు చేసే పనులే. మనసుతో జీవిస్తాడు. (మనోమయజీవి) కనుకనే మానవుడు అనిపించుకున్నాడు. పాప పుణ్యాలకి, సంసార బంధానికి, మోక్షానికి, సుఖానికి, దుఃఖానికి అన్ని ద్వంద్వాలకి మూలకారణం మనసేనని ఉపనిషత్ సూక్తి 'నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది' ఇది మనస్సు శక్తి, కాని దాని లక్షణం మాత్రం చాంచల్యం, వట్టికోతి. అంతవరకూ అయితే నయం, దానికిలేని దుర్గుణం చెడు భావన ఇతరులకు హాని చేసే లక్షణం, అసూయ, స్వార్ధం మొదలైనవికూడా మనిషి మనస్సు యొక్క విక్షేపాలు. భగవంతుడు ప్రసాదించిన మనస్సు అనే వరాన్ని సద్వినియోగం చేసుకుంటే మనిషి మహాత్ముడవుతాడు. దుర్వినియోగం చేసుకుంటే రాక్షసుడౌతాడు. మానవుడు పూర్ణమానవుడిగా ఎదగటానికి భగవంతుడు ప్రసాదించిన మనస్సు ఎలా వినియోగించుకోవాలో ఒక్కమాటలో చెప్పారు, అమ్మగారు సాక్షాత్ తనుమధ్యాంబా అవతారం కనుకనే శ్రీ కమలాంబికగారు మోక్షమార్గాన్ని ఇంత సూక్ష్మంగా సెలవిచ్చారు.

ప్రతిదానిని లాభనష్టాల లెక్కలతో కొలిచే, వ్యాపారమనస్తత్వం వంటపట్టించుకున్న మనుషులు పుణ్యలబ్ధులై 'శ్రీ చక్రార్చన' మొదలైనవి చేసి, త్వరత్వరగా పుణ్యం సంపాదించుకుందామని తాపత్రయపడటం కనపడుతోంది. చేతులు యాత్రికంగా అర్చన చేస్తున్నా, నోరు మంత్రం పలుకుతున్నా, మనసు మాత్రం మరెక్కడో ఉంటుంది. ఎన్నో దురాలోచనలు చేస్తూ ఉంటుంది. అర్చన చేసి ప్రయోజనమేమిటి? ఎదటి వారికి కష్టం కలిగించే పనులు చెయ్యాలనే ఆలోచన, వక్రబుద్ది లేని మనసు ఉంటే శ్రీ చక్రార్చన చేసిన ఫలితం లభిస్తుంది అని శిష్యుల ప్రవర్తనను, దానికి కారణమైన మనస్సును సరిదిద్దే ఆదేశసూత్రం ఇచ్చారు, సద్గురు కమలాంబికగారు.

గురుదర్శనమే సర్వదేవతా దర్శనము గురుర్బ్రహ్మా, గురుర్విష్ణుః, గురుర్దేవోమహేశ్వరః గురుస్సాక్షాత్ పరంబ్రహ్మా, తస్మైశ్రీగురవేనమః

సృష్టి, స్థితి, లయ కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వారికి మూలమైన పరబ్రహ్మా కూడా సాక్షాత్ గురువే. కనుక గురువుకి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్ధం. ఇది గురువు యొక్క సమగ్రరూపాన్ని మనముందు ఉంచుతుంది. గురువును మించిన దైవం మరొక్కటి లేదని, అన్నీ గురువులోనే ఉన్నాయని, గురువుకు నమస్కరిస్తే అందరు దేవతలకు నమస్కరించినట్టేనని అర్ధం.

భగవంతుడున్నాడని ఆస్తికులందరూ నమ్ముతారు. పేర్లు వేరు కావచ్చు కాని భగవంతుని చూచినవారు అరుదు. సద్గురువుని ఆశ్రయిస్తే దైవదర్శనం ప్రాప్తిస్తుంది. సద్గురువు అంటే భగవంతుని దర్శించి, భగవదనుభూతి తాను పొంది, తన శిష్యులకు పంచగలవాడు, ఒక్కసారి భగవదనుభూతిని పొందితే పరసువేది స్ప్రర్శసోకిన లోహంలాగ ఎవరైనా భగవత్స్వరూపమే! సద్గురువు పరమాత్మ స్పర్శను అనుభవించాడు కనుక పరమాత్మయే, వారిని దర్శిస్తే సర్వదేవతలను దర్శించినట్టే అవుతుంది, అటువంటి సద్గురువు లభించిన తర్వాత నిశ్చింత. పాదాలు పట్టుకోవటం వరకే శిష్యుడి పని. ఆపై బరువు బాధ్యతలన్నీ వహించి, దరిచేర్చవలసింది గురువే భగవత్సాన్నిధ్యమో, మోక్షమో! శిష్యుడి పని - గురువుపై అంచలంచల విశ్వాసం ఉంచి, గురువు చెప్పినట్టు వినటమే. కన్నతల్లి లాగా ఎవరికేది కావాలో, ఎవరికి ఏది తగినదో దానిని సమకూరుస్తాడు గురువు. భగవంతుడు పాంచభౌతిక శరీరంతో అందరికీ దర్శనమీయటం సాధ్యంకాదు, కనుక గురువులోనే కనపడతాడు శిష్యులకి.

నిర్మల హృదయం - భగవతి నిలయం

పరమాత్మ సర్వాంతర్యామి. శక్తిస్వరూపంగా సర్వజీవుల హృదయాలలోను నివాసం ఉంటాడు. ఈ భావాన్నే సప్తశతి వివరంగా వర్ణిస్తుంది. "యాదేవీసర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా.... క్షుదారూపేణ సంస్థితా.... లజ్జారూపేణ సంస్థితా.... నమస్తస్త్యె నమస్తస్త్యె నమోనమః అంటూ జీవి శరీరంలోని అన్ని శక్తులూ అమ్మవారి రూపాలేనంటుంది. ఈ శక్తులన్నింటికి మూలమైన ఆదిశక్తి, పరాశక్తి, భగవతి జీవుల గుండె అనే గుడిలో కుదురుగా ఉండిపోవటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అయితే, మనిషి అమ్మవారిని తన హృదయంలో నివాసం ఉండటానికి రానీయడు. వచ్చినా తరిమేస్తాడు. నోటితో మాత్రం రమ్మని ఆహ్వానిస్తాడు. పిలిచాక ఉండటానికి చోటు చూపించాలి కదా! గుండెలో ఉండమని చూపితే అప్పటికే గుండె కామక్రోధాలు, ఈర్షాసూయలు, రాగద్వేషాలు మొదలైన వాటితో నిండిపోయి ఉంటుంది. "అమ్మ" ఎక్కడ ఉంటుంది?

శ్రీమాత మన గుండెల్లో గూడుకట్టుకుని ఉండాలనుకుంటే దానిని ఖాళీచేయాలి. ఆపై శుభ్రం చేయాలి. అప్పుడు అది తను ఉండటానికి తగిన ప్రదేశమని తలచి ఆ తల్లే వచ్చి చేరుతుంది. వెదురుపుల్ల తనలో ఉన్న అహంకార మమకారాదులను కణుపులను తొలిచివేసి, తనను తాను గుల్లగా చేసుకుంది గనుగనే కృష్ణుని చేతిలో ప్రవేశించి, పెదవులను చేరి, కృష్ణుని ఊపిరిని విశ్వమోహనరాగంగా తనలో నింపుకోగలిగింది. తన అస్తిత్వాన్ని ఖాళీ చేసుకుంది కనుకనే కృష్ణగానానికి చోటు ఇవ్వగలిగింది.

శారీరక, మానసిక ఆత్మపరమైన మాలిన్యాలని తొలగించుకున్న భక్తహృదయంలో "అంతర్ముఖసమారాధ్య" అయిన భగవతి స్ధిరనివాసం ఉంటుంది. కనుకనే నిర్మల హృదయమే భగవతి నిలయమవుతుందని ఆదేశించినారు.

ల్ప విద్యలు విసర్జించు - ముక్తి మార్గమును అనుసరించు

కోటివిద్యలు కూటికొరకే అని సామెత, ఇది సామాన్య మానవులకు సంబంధించినది. కూడు, గూడు మాత్రమే జీవితపరమార్ధం అనుకునేవారిది. మాన్యులైన వారి జీవితపరమార్ధం అవి మాత్రమే కాదు. సంసార చక్రాన్ని ఛేదించి ముక్తిని పొందటం. పొట్టకూటికోసం ప్రయత్నించే స్ధాయినుండి ముక్తిని పొందే స్ధాయికి ఎదగాలి. ధర్మం, అర్ధం, కామం అనే పురుషార్థాలు శరీరం ఉండగా సాధించవలసినవి. ధర్మబద్ధంగా అర్ధాన్ని(ధనాన్ని) ఆర్జించి. దానితో 'కామాన్ని' సాధించినప్పుడు సిద్ధించేది మోక్షం. ఈ మోక్షాన్ని కలిగించే మార్గాన్ని అనుసరించమని కమలమ్మ గారు చేసిన ఉపదేశం. ఏ జీవి అయినా ఎప్పటికైనా సాధించవలసింది అదే. ఎప్పుడో అన్నీ అయినాక చివరి రోజుల్లో ఆ ప్రయత్నం చేస్తాననటం సరికాదు. శరీరంలో పటుత్వం ఉన్నప్పుడే చేయాలి. వృద్ధాప్యంలో శారీరమానసిక ఆరోగ్యాలు సహకరిస్తాయో లేదో చెప్పలేము కదా!

అయితే దానికోసం ప్రయత్నిస్తుంటే బతకటం ఎలా? 'శరీరమాద్యంఖలు ధర్మసాధనం' అంటారు కదా! అనే అనుమానం రావచ్చు. మంచి మార్గంలో వెళ్ళేవారికి అవసరమైనవి వాటంతటవే సమకూరుతాయి. అది సృష్టిప్రణాళికలో భాగం, దానినే 'దైవకృప' అని పిలుస్తారు. లోకంలో జీవులు పడే ఇబ్బందులన్నీ సరైన సంకల్పం(సంకల్ప శుద్ధి), సరైన దానినెన్నుకోలేక పోవటం వల్లవచ్చేవే. దారిచూపే సద్గురువు పక్కనే ఉండి, చెయ్యిపట్టి నడిపిస్తూ 'ముక్తి ధామం' చేరే దారి పట్టు అని ఆదేశిస్తుంటే ఆలస్యం ఎందుకు? అనుసరించు.

పాసన కన్న జ్ఞానం మిన్న - జ్ఞానం కన్న ఆచరణ మిన్న

జగన్నాటక సూత్రధారి రచించిన నాటకం రక్తిగా సాగాలంటే అందరూ తమతమ పాత్రలని సవ్యంగా నిర్వర్తించాలి. తమకు నిర్దేశించబడిన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించాలి. తమ విధ్యుక్తధర్మాన్ని నిర్లక్ష్యం చేయటాన్ని భగవంతుడు మెచ్చడు. ఉపాసన, పూజ మొదలైనవి చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నామో తెలిసి చేయాలి. మూర్ఖంగా, గుడ్డెద్దుచేలోపడ్డట్టు చేసే దానికన్న తెలిసి చేస్తే ఆనందం అధికం. ఆ తెలివే జ్ఞానం. అప్పుడు ఉపాసన మరింత సమర్ధవంతంగా చేయవచ్చు.

ఈ జ్ఞానం ఎటువెళ్ళాలో దారిని చూపించగలదు. కాని లక్ష్యం దగ్గరికి చెయ్యపట్టుకుని తీసుకుని వెళ్ళలేదు. లక్ష్యం చేరాలంటే స్వయంగా వెళ్ళటం తప్పదు. అదే ఆచరణ, భగవదనుభూతి పొందాలంటే. భగవంతునికి సంబంధించిన సమాచారం సేకరిస్తే సరిపోదు. ఆ తత్వాన్ని అంతరంగంలోనూ, బాహ్యంగానూ కూడా అనుభవంలోకి తెచ్చుకోవాలి. అన్నం తింటే ఆకలి తీరుతుంది అనే జ్ఞానం ఉంటే ఆకలి తీరదు. పట్టెడు మెతుకులు తినటం అనే ఆచరణతో మాత్రమే ఆకలి తీరుతుంది. తియ్యదనం అంటే ఏమిటి? అని గంటల తరబడి చెప్పే దానికన్న చిటికెడు పంచదార నాలికమీద వేస్తే బాగా తెలుస్తుంది. జ్ఞానం ఆచరణ సరైన దారిలో సాగటానికి సహకరిస్తుంది. అంతే! ఫలితం సిద్ధింపచేసి, భగవదనుభూతి కలిగేటట్టు చేసేది ఆచరణ మాత్రమే.

మనుషులు ఉపాసన పేరుతో దైనందిన కార్యాలు చేయక మూర్ఖంగా సోమరి పోతులుగా తయారవకుండా జ్ఞానాన్ని సముపార్జించుకోవాలని, ఆ జ్ఞానం తోడ్పాటుతో కర్మలను చేయాలని శిష్యులకు బోధించారు శ్రీశ్రీశ్రీ కమలాంబికగారు.

నేను భక్తికి వశమౌతాను. ఎదుటి వారి బాధలే నా బాధలు 'మోక్షసాధనసామాగ్ర్యాక్తిరేవహరీయసీ'

పిల్లలకి పెద్దలమీద, భక్తులకి భగవంతుడి మీద, శిష్యులకి గురువుమీద ఉండే ప్రేమే భక్తి. అకారణమైన అంతులేని ఇష్టం ప్రేమే. ఈ ఇష్టం ఏ తర్కానికి లొంగదు. గుణదోషాల ప్రసక్తి ఉండదు. అటువంటి ఇష్టం అదే ప్రేమ, ఎంతో శక్తివంతమైనది. ప్రేమకున్న శక్తికి వశంకానిదేదిలేదు. భగవంతుడైన, భగవత్స్వరూపుడైన గురువైనా అచంచలమైన భక్తికి వశమవుతారు. అందుకే భగవంతుని చేరుకునే మార్గాలన్నింటిలోకి ఉత్తమమైనది, సులభమైనదిగా భక్తిని పేర్కొనటం జరిగింది. అంబరీషుడు, ప్రహ్లాదుడు మొదలైనవారి కథలన్ని కూడా భగవంతుడు భక్తులకే విధంగా వశవర్తి అయిఉన్నాడో తెలియచెపుతాయి. సద్గురువైన శ్రీకమలాంబికగారు తన శిష్యులకి అదే మాట ఎంతతేలికగా చెప్పారో! చెప్పటమే కాదు. చేసి చూపారు కూడా కదా!

సర్వాంతర్యామిగా అందరు జీవులలోనూ ఉన్న భగవంతునితో, తనలో ఉన్న భగవదంశను అనుసంధానం చేసుకుంటే విశ్వచైతన్యంలోని అన్ని స్పందనలూ తనవిగా అనుభూతమవుతాయి. అప్పుడు అందరి సుఖదుఃఖాలు తనవిగానే ఉంటాయి. ఎదుటివారు ఆనందంగా ఉంటే ఆనందించటం ఉంటుంది. ఎదుటివారు బాధపడుతుంటే అవి తనవిగా అనిపిస్తాయి. ఈ స్థితికి రావటం అంటే భౌతికతను అధిగమించడం. తప్పశ్శక్తి సంపన్నులైన గురువులకీ స్థితి సర్వసామాన్యం. "యోగాక్షేమంవహామ్యహమ్" అని స్వీకరించిన శిష్యులుగాని, తన ఎదుటనున్న వారుకాని బాధపడుతుంటే, కరుణాహృదయాలు గనుక చూడలేరు. జీవచైతన్యసంధానం ఉంటుంది కనుక వారి బాధలను తాము స్వీకరించటం జరుగుతుంది. ఇది కమలాంబికగారి, త్రిపురంగారి, రత్నబాలగారి శిష్యులందరికీ అనుభవమే.

న్ను నమ్ము. నిన్ను ఎక్కడికి చేర్చాలో నాకు తెలుసు.

నమ్మకం మనిషికి ఎంతో బలాన్నిస్తుంది. దేనినో ఒకదాన్ని దేవుడో, గురువో, సిద్ధాంతమో, మరేదో, ఏదీలేకపోతే తనని తానే నమ్ముతాడు మనిషి. ఆ నమ్మకమే ముందుకు సాగే ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. "నమ్మి చెడినవారు లేరు" మనిషిని రక్షించేది తాను నమ్మినదికాదు. దానిపై తనకున్న నమ్మకం. అందుకే మోసగాళ్ళని, దుర్మార్గులని నమ్మిన వాళ్ళు కూడా తాత్కాలికంగా నష్టపోయినట్టు కనిపించినా, చివరకు సత్ఫలితాలనే పొందటం మనం చూస్తాం. అంటే ఆ శక్తి నమ్మకానిది.

చెడ్డవారిని నమ్మినా మంచి ఫలితాలు వచ్చేటప్పుడు మంచివారిని నమ్మితే మరెంత సత్ఫలితాలుంటాయో కదా! అనేకమంది శిష్యులను ఉద్ధరిచటానికి అవతరించిన సద్గురువు కమలాంబికగారిని నమ్మితే చాలు! ఆ పై సంగతి తానే చూసుకుంటానని వాగ్దానం చేశారు. అటువంటి ఋషులమాట వమ్ముకాదు. నన్ను నమ్ము అంటే కమలాంబికగారిని అనే అర్థం మాత్రమే కాదు. ఎవరికివారు తమలో 'నేను' అనే రూపంలో ఉత్తమపురుష ఏకవచనంగా ఉన్న పురుషోత్తముడిని నమ్ము అని కూడ అర్థం చెప్పుకోవచ్చు. తనపై తనకు నమ్మకం ఉండాలి, లేకపోతే 'సంశయాత్మావినశ్యతి' కదా!

అటువంటి నమ్మకం ఉంటే చేర్చవలసిన చోటుకి చేర్చుతారు. ఎక్కడికి చేరాలో శిష్యులలో ఎంతమందికి తెలుసు? స్వర్గం చేరితే చాలు అనుకోవచ్చు అమాయకత్వంతో చాక్లెట్ చాలు అనే పిల్లలలాగా. అందుకని వెళ్ళవలసిన ప్రదేశం కూడ తానే నిర్ణయిస్తానన్నారు శిష్యవాత్సల్యం గల గురువు కమలాంబికగారు.

నేను ఈ పీఠంలో ఉంటాను. నీడలా నా భక్తులను వెన్నంటి కాపాడుతాను.

ప్రతి జీవిని ఉన్న స్థాయి నుండి పై స్థాయికి తీసుకుని వెళ్ళే ప్రయత్నంలో ఉంటారు పరమగురువులు, వారి అనుయాయులు. ఎన్నో జన్మలసత్కార్యాలు, సాధన తరువాత మాత్రమే గురువుని ప్రత్యక్షంగా చూడటం వీలవుతుంది. అంతకుముందు కూడా జీవి ఆద్యాత్మిక ప్రగతికి గురువు దోహదం చేయటం వల్లనే అంత పురోగమించటం సాధ్యమయింది. వారి వారి సాధన తీవ్రతను బట్టి పురోగమనం ఉంటుంది. ఒక్కసారి గురుశిష్యులు ప్రత్యక్షంగా కలుసుకున్నాక చేయవలసిన సాధనాక్రమం శిష్యుడికి మరింత స్పష్టంగా అవగతమవుతుంది. ఎంతటి ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సాధించిన మనిషి భౌతికరూపం ఒకటి ఆలంబనగా కోరుకోవటం సహజం. సర్వదేవతాస్వరూపంగా గురువుని తలచి సేవించిన శిష్యులకి గురువు అవతారసమాప్తి నిరాశానిస్పృహలని కలిగించే ప్రమాదం ఉంది. గురుతత్త్వానికి తాను చూసిన శరీరం ఒక ఆలంబన మాత్రమే అని తెలిసినా. అందుకని, ఆ గురి నిలవటంకోసం తాను (అంటే గురుతత్త్వం) పీఠంలోనే ఉంటాను అని శిష్యులకు వాగ్దానం చేశారు. "అమ్మయ్య! శ్రీ కమలమ్మగారు శరీరం లేకపోయినా ఇక్కడ ఉన్నారు" అనే నమ్మకం శిష్యులని ముందుకు నడిపిస్తుంది.

తానున్నాని చెప్పటమే కాదు, నీడలా వెన్నంటి కాపాడతానని కూడ చెప్పారు. అంటే, ఒక్క పీఠంలోనే కాదు ఉండేది. సర్వాంతర్యామిగా అన్నిచోట్ల ఉండి తన శిష్యులని కాపాడతానన్నారు. దీనికి శ్రీకమలాంబికగారి శిష్యులకి వివరణ ఇవ్వనక్కరలేదు. ఆ సద్గురువుకి ఒక్కసారి నమస్కరించుకుని శరణాగతులైన వారందరికీ అనుభవమే-ఆమె భౌతిక శరీరంలో ఉన్నప్పుడు, తరువాత కూడా ఆపద సమయంలో పక్కనే ఉండి గట్టెక్కించటం.

నీవు వినగలిగితే రైలు కూతలో ఓంకారం వినబడుతుంది.

అంతా మన దృష్టిలోనే ఉంది. మన దృష్టి అంతా మనసు చేసే మాయాజాలంలో ఇరుక్కొనిపోయి ఉంది. మన స్థితిని అనుసరించి అభిప్రాయాలు, అవగాహనల్లో తేడా వస్తూ ఉంటుంది. సర్వాంతర్యామి అయిన పరమాత్మను అంతటా చూడటం అలవాటు చేసుకున్న మనిషికి "సర్వం విష్ణుమయంజగత్". అప్పుడు తాను చూస్తున్న ప్రతి మనిషి, ప్రతి వస్తువు విష్ణుస్వరూపం. ప్రతి జీవిచేష్ట విష్ణువిలాసం. ప్రతి ధ్వని ప్రణవం. తనని తాను పరిపూర్ణంగా సమర్పణ చేసుకున్న మనిషికి మాత్రమే ఈ స్థితి సాధ్యమవుతుంది. కాని ఎప్పటికైనా అందరూ చేరవలసిన స్థితి ఇది.

ఓంకారము నుండియే ఈ సృష్టి అంతా వచ్చింది. మళ్ళీ తిరిగి అందులోనే లయమవుతుంది. దానిని అర్థం చేసుకుంటే సృష్టి రహస్యం అవగతమవుతుంది. పరమాత్మని, ప్రణవాన్ని సమస్తంలో చూడగలిగే స్థితి వస్తుంది. దీనికోసం వేదాదులు అధ్యయనం చేసి, వేదాంతాన్ని అనుసంధానం చేయవలసిన పనిలేదు. తపస్సు, యజ్ఞాలు మొదలైనవి చేయనక్కరలేదు. మనచుట్టూ ఉండే వస్తువులలో, మనుషులలో, పరిస్థితులలో సమన్వయరూపంగా దైవాన్ని దర్శించగలగాలి. అప్పుడు మనం చేసే సాధనకి అన్నీ సహకరిస్తాయి. నా ధ్యానానికి ఏదో శబ్దం భంగం కలిగించింది అనుకోనక్కరలేదు. అందుకే శ్రీకమలమ్మగారంటారు "వినగలిగితే రైలుకూతలో ఓంకారం వినపడుతుందని" ధ్యానంలో ఉన్నప్పుడు రైలుకూత వినపడితే అది ఓంకారంలాగా ధ్యానానికి సహకరిస్తుంది. నిజానికి మనసంతా ఓంకారం నిండి ఉంటే ఏదైనా అలాగే వినిపిస్తుంది. గోపిక మనసులో కృష్ణుడే నిండి ఉండటంతో, పక్క గోపిక కూడ కృష్ణుడు లాగా కనపడినట్టు "యాద్భావం తద్భవతి"

భౌతిక శరీరముల అనుబంధం కన్న ఆత్మల అనుబంధం గొప్పది.

ప్రవాహవేగానికి కలిసిన కట్టెలు అదే వేగానికి కొద్ది సమయం తర్వాత విడిపోతాయి. మానవుల సంబంధాలింతే! అని వివరిస్తాయి ఉపనిషత్తులు రైలు ప్రయాణీకులలాంటి సంబంధాలు. ఎవరు దిగవలసిన చోటు ముందు వస్తే దిగిపోతారు అంటారు ఆధునికులు. ఇవి భౌతిక శరీరసంబంధాలు. శరీరాలతోనే సరి. యాదృచ్ఛికంగా కలిసిన చుట్టరికాలు. పూర్వజన్మకర్మలఫలంగా పుట్టుకతో వచ్చిన బంధాలు శరీరసంబంధమైనవి. కాని, నిజమైన అనుబంధం ఆత్మలది. అది జన్మజన్మాంతరాలది. ముఖ్యంగా గురుశిష్యులతో సంబంధం ఎన్నో జన్మలుగా కొనసాగుతూ ఉంటుంది. అందుకే రక్తసంబంధీకులతో కన్న గురువుతో, సాటి శిష్యులతో ఎంతో ఆత్మీయంగా మెలగటం వారెంతో కావలసిన వారిగా అనిపించటం, మనసువిప్పి మాట్లాడటం జరుగుతంది. భౌతికశరీరాల చుట్టరికం తాత్కలికం. ఏ జన్మలో ఎవరికెవరో? ఆత్మపరమైన చుట్టరికం శాశ్వతం. కలకాలం కొనసాగేది. అందుకే చాలా బలమైన అనుబంధం ఉంటే 'ఆత్మబంధువు' అంటారు. ఈ బంధుత్వంలో భౌతికసంబంధమైన మాలిన్యాలు ఉండవు గనుక స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సాధనలో పెంపొందించుకోవలసింది ఈ ఆత్మానుబంధమే అప్పుడు కాలము, దూరము అన్నవి సమసిపోయి "ఏకమై" ఉండటం సాధ్యమవుతుంది.

నీ మనసు విశాలం చేసుకో.

"ప్రతిది కేంద్రమే. పరిధి ఎక్కడా లేదు" అనేది ఆత్మతత్త్వం గురించి భారతీయ ఋషులు చెప్పిన మాట. ప్రతిది అంటే అణువు కావచ్చు. బ్రహ్మాండం కావచ్చు. జీవాత్మ కావచ్చు. ఎక్కడి నుండి ఆలోచనలు, ఆచరణ ప్రారంభమవుతాయో అటువంటివి ఏవైనా సరే! ఈ మాటల్లో మహార్ధం ఇమిడి ఉంది. ఒక సంకల్పబిందువు విస్తరించి బ్రహ్మాండంగా రూపు దాల్చింది. దానికి సరిలేదు. ఎంత? అన్న పరిమితి లేదు. అదే విధంగా ఒక జీవిలోని ఆత్మ విస్తరించుకుంటూపోతే బ్రహ్మాండం అంతా వ్యాపించవచ్చు. అలా వ్యాపించాలంటే ముందు పరిమితులను అధిగమించాలి. లాభనష్టాలను లెక్కవేసి, పరిమితులను నిర్ణయించి, జీవితాలని ఇరుకుగా చేసేది మనస్సు. కనుక మనసులోని ఇరుకుతనాన్ని పోగొట్టుకోవాలి. మనసు పరిధిని పెంచుకుంటూపోవాలి పరిధిశిధిలమై అంతరించేదాకా! ఇదెలా సాధ్యం? గాలిబుడగ పెద్దదిగా అవుతున్నకొద్దీ దానిపై భాగం పలచబడి, ఒత్తిడి ఎక్కువకాగానే బద్దలవుతుంది, అదేవిధంగా మంచి ఆలోచనలు మనసులో చేరిన కొద్దీ మనసు ఉబ్బిపోతూ విశాలంగా అవుతూ ఉంటుంది. చెడు ఆలోచనలని తరిమేటందుకు ప్రత్యేక ప్రయత్నం చేయనక్కరలేదు. మంచి ఆలోచనరాగానే, వెలుగురాగానే చీకట్లలాగా, దురాలోచనలు పారిపోతాయి. ఎదుటివారి గురించి ఒక్కసారి మంచి ఆలోచనచెయ్యండి! వారికి శుభం కలగాలని కోరుకోండి. మనకి హాని చేసినవాడికైనా! చూడండి మనసెంత తేలికగా ఆనందభరితంగా ఉంటుందో! దీనినే మామూలు మాటలలో "కొంచెం పెద్ద మనసు చేసుకో"! అంటుంటారు. ఎంతగా ఇతరుల మేలుకాంక్షిస్తే మనసంత విశాలం అవుతుంది. 'సర్వేజనాఃసుఖినోభవంతు' అన్నది వంటపడితే మనసు విశ్వమంత విశాలం అవుతుంది. అందరూ అంతటి విశాలమనస్కులుకావాలని శ్రీకమలమ్మగారి ఆకాంక్ష.

ర్మానుభవము తప్పద్దు. గురుకృపే శరణ్యము.

ఈ సంసారచక్రమంతా కార్యకారణసంబంధం మీద ఆధారపడి నడుస్తోంది. అవి పరస్పరం తారుమారయి జన్మ హేతువులవుతున్నాయి. కారణం (ఈ జన్మలో కర్మ) నుండి మరుజన్మ కార్యం వస్తుంది. అప్పుడు చేసే కార్యం, తరువాత జన్మకి కారణం అవుతుంది ఇది గొలుసులాగా నడుస్తుంది. దీనినే కర్మసిద్ధాంతంగా కూడ చెప్పవచ్చు. అంటే ఎవరుచేసిన కర్మఫలితాన్ని వారనుభవించకతప్పదు. మంచి అయినా, చెడు అయినా, అవి వేటికవే. మంచి కర్మకి మంచి ఫలితం అదే పుణ్యం. చెడు కర్మకి చెడు ఫలితం అదే పాపం. ఒకదానితో మరొకదానిని చెల్లు వెయ్యటం సాధ్యంకాదు. దేని లెక్క దానిది.

అయితే దేవుడెందుకు? గురువెందుకు? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కర్మఫలానుభవరూపమే దైవం అని చెపుతుంది శ్రీమద్భాగవతం. జీవుడు చేసిన పనుల ఫలితాన్ని అనుభవింపచేసి కర్మనిర్ముక్తుని చేస్తాడు దైవం. అయితే, ఈ మధ్యలో మళ్ళీ కర్మలాచరించి మరో జన్మకి పునాది వేసుకుంటాడు. ఈ గొలుసుని ఛేదించటానికి దైవానుగ్రహం, గురుకృప అవసరం. ఇవి ఉంటే కూడా కర్మఫలానుభవం తప్పదు. అయితే గురుకృప ఉంటే కర్మఫలితాన్ని అనుభవించటం నామమాత్రంగా ఉంటుంది. తీవ్రత ఉండదు. ఉదాహరణకి తీవ్ర అనారోగ్యంపాలయి, ఆస్పత్రిలో ఉండవలసిన కర్మ ఉంటే, గురుకృప కల వ్యక్తి, ఎవరో అనారోగ్యంతో ఉన్నరోగికి సేవచెయ్యటానికి ఆసుపత్రిలో గడుపుతాడు. అనుభవం పూర్తి అవుతుంది.

మనిషై పుట్టాక ఏమీ చేయకుండా ఉండటం ఎలా కుదురుతుంది? తనంతట తాను సంకల్పించి చేసిన పనుల ఫలితం తాననుభవించక తప్పదు. గురువు ఆజ్ఞపై చేసిన పని ఫలితం మనకి కర్మరూపంలో వెంటరాదు. ఈ మర్మాలన్నీ తెలుసుకొనకనే గురుకృపేశరణ్యం, గురుకృపని పొందండి! అని ఆదేశించారు సద్గురు కమలాంబికదేవిగారు.